కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు

  • ఢిల్లీ వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన జాగృతి ప్రతినిధులు
  • మరో మూడు నెలల్లో పార్టీకి గుర్తింపు లభించే అవకాశం
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న ‘జాగృతి’!
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేశారు. గత కొంతకాలంగా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమైన 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఢిల్లీ వెళ్లిన జాగృతి ప్రతినిధులు ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మరో మూడు నెలల్లో పార్టీకి అధికారిక గుర్తింపు లభించే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగితే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే కవిత తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను ఏకం చేయడమే లక్ష్యమని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా బీసీ కులగణన విషయంలో బీజేపీ కొత్త మోసానికి తెరతీసిందని ఆరోపించారు. ఇటీవల విడుదలైన 'జనగణన-2026' డాక్యుమెంట్‌లో బీసీల గణనకు సంబంధించిన ఆప్షన్ లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వెనుకబడిన వర్గాలను వంచించడమేనని విమర్శించారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా కవిత స్పందించారు. ఈ వివాదంలో తాను కూడా బాధితురాలినేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు ఇస్తున్న నోటీసులకు ప్రాతిపదిక ఏంటో అర్థం కావడం లేదు. అవి నేరంలో భాగస్వాములైన వారికి ఇస్తున్నారా లేక బాధితులకు ఇస్తున్నారా?" అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల వేళ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ పాత కేసును మళ్లీ తెరపైకి తెచ్చిందని ఆమె ఆరోపించారు. జనగామ జిల్లా జఫర్‌గడ్‌ పర్యటనలో ఉన్న ఆమె, దివంగత గాదె ఇన్నయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News