ఇది ఫ్లెక్సీ కాదు...కొత్త సినిమా ప్రకటన!

  • సరికొత్త ఐడియాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర
  • మూవీ మేకింగ్ రియాలిటీ షో ‘షో టైమ్ - సినిమా తీద్దాం రండి’ను ప్రకటించిన అనిల్ సుంకర
  • అందరి దృష్టిని ఆకట్టుకున్న విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర వినూత్న ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా మారింది. సాధారణ ఫ్లెక్సీలా కాకుండా, సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ‘షో టైమ్ - సినిమా తీద్దాం రండి’ పేరుతో మూవీ మేకింగ్ రియాలిటీ షోను ప్రకటించిన అనిల్ సుంకర, ప్రతిభావంతులైన కొత్తవారికి అవకాశాలు కల్పించాలనే తన ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్‌పై కొత్త నటీనటులతో రూపొందించే చిత్రానికి ‘ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు.

విజయవాడలోని ఓ ప్రముఖ కూడలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మట్టివాసనతో, వినోదాత్మక సందేశంతో రూపొందించిన ఈ ప్రకటన ప్రత్యేకంగా నిలుస్తోంది. ‘అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు’ అనే సంభాషణ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితాల్లో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. వారు తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే కష్టాలు, ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించారు? చివరికి ఎలా విజయం సాధించారు? అనేదే ఈ చిత్ర కథాంశం. 


More Telugu News