వారు ఇచ్చే స్వేచ్ఛ వల్లే అద్భుతమైన అవుట్ పుట్ వస్తుంది: అనిల్ రావిపూడి

  • తన సినిమాలకు సుమారు 80 శాతం వరకు కుటుంబ ప్రేక్షకులే వస్తారన్న అనిల్ రావిపూడి
  • ఎఫ్ - 2. ఎఫ్ - 3 వంటి సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండటమే వాటి భారీ విజయానికి కారణమని వెల్లడి
  • తన సినిమాల్లో హాస్యం ప్రధానంగా కనిపించినప్పటికీ, దాని వెనుక బలమైన భావోద్వేగాలు, అంతర్లీన సందేశం తప్పనిసరిగా ఉంటాయన్న అనిల్ రావిపూడి
ప్రముఖ నటులు వెంకటేశ్, బాలకృష్ణ వంటి వారు ఇచ్చే స్వేచ్ఛ వల్లే అద్భుతమైన అవుట్‌పుట్ వస్తుందని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అనిల్ రావిపూడి.. తన సినీ ప్రయాణం, విజయాల వెనుక ఉన్న ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలను ఆసక్తికరంగా పంచుకున్నారు. తన సినిమాలకు సుమారు 80 శాతం వరకు కుటుంబ ప్రేక్షకులే వస్తారని, వారిని అలరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎఫ్-2, ఎఫ్-3 వంటి సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండటమే వాటి భారీ విజయానికి కారణమని తెలిపారు. స్టార్ హీరోలతో పని చేసే సమయంలో వారి ఇమేజ్‌ను గౌరవిస్తూనే, తనదైన వినోద ముద్రను జోడిస్తానని చెప్పుకొచ్చారు.

తన సినిమాల్లో హాస్యం ప్రధానంగా కనిపించినప్పటికీ, దాని వెనుక బలమైన భావోద్వేగాలు, అంతర్లీన సందేశం తప్పనిసరిగా ఉంటాయని తెలిపారు. కేవలం కామెడీతోనే కాకుండా, ప్రేక్షకులను కథతో మమేకం చేసే అంశాలు ఉంటేనే సినిమా నిజమైన విజయాన్ని సాధిస్తుందని అన్నారు. స్క్రిప్ట్ రాసే సమయంలో తాను పూర్తిగా రచయితగా ఆలోచిస్తానని, సెట్స్‌పైకి వెళ్లాక దర్శకుడిగా మారడమే తన విజయ రహస్యమని వివరించారు. రీమేక్ సినిమాలకంటే కొత్త సబ్జెక్టులకే ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై స్పందిస్తూ... భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ, ప్రేక్షకులకు కొత్తదనం అందించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 


More Telugu News