Bank Strike: రేపు బ్యాంకుల సమ్మె... స్తంభించనున్న పలు సేవలు!

Bank Strike Tomorrow Services to be Disrupted
  • వారానికి 5 రోజుల పని కోసం ప్రభుత్వ బ్యాంకుల సమ్మె
  • మంగళవారం దేశవ్యాప్తంగా సేవలకు అంతరాయం
  • వరుసగా మూడు రోజులు మూతపడనున్న బ్రాంచులు
  • ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాతథం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు మంగళవారం అంతరాయం కలగనుంది. వారానికి ఐదు రోజుల పనిదినాలు డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చింది. ఆదివారం సెలవు, సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో ఇప్పటికే రెండు రోజులు బ్యాంకులు మూతపడ్డాయి. ఇప్పుడు సమ్మె కారణంగా వరుసగా మూడో రోజు కూడా బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండవు.

ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకే మొగ్గు చూపుతున్నట్లు బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మె ప్రభావంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కు క్లియరెన్స్ వంటి సేవలు స్తంభించనున్నాయి.

అయితే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. వాటి ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని అంచనా. కానీ, కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది.

ఇప్పటికే పలు ప్రభుత్వ బ్యాంకులు తమ కార్యకలాపాలపై సమ్మె ప్రభావం ఉండొచ్చని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చాయి. ప్రతి నెలా మొదటి, మూడు, ఐదో శనివారాలు బ్యాంకులు పనిచేస్తున్నాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలన్నది ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్. దీనిపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదిరినా, ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Bank Strike
United Forum of Bank Unions
UFBU
Bank Employees Union
Public Sector Banks
Bank Services Disruption
Five Day Work Week
SBI
PNB
Bank of Baroda

More Telugu News