Don Bradman: క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మన్ టోపీకి వేలంలో రికార్డు ధర

Don Bradmans Baggy Green Cap Sold for Record Price at Auction
  • సుమారు రూ. 2.92 కోట్లకు టోపీని సొంతం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి
  • భారత క్రికెటర్ సోహోనీకి బ్రాడ్‌మన్ స్వయంగా ఇచ్చిన బహుమతి ఇది
  • 70 ఏళ్లు దాటినా చెక్కుచెదరకుండా ఉండటంతో పెరిగిన విలువ
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన చారిత్రక 'బ్యాగీ గ్రీన్' టోపీ వేలంలో రికార్డు ధర పలికింది. గోల్డ్ కోస్ట్‌లో సోమవారం జరిగిన వేలంలో ఈ క్యాప్‌ను ఏకంగా 4,60,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.92 కోట్లు) ఓ అజ్ఞాత వ్యక్తి సొంతం చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బ్యాటర్‌లలో ఒకరిగా పేరుగాంచిన బ్రాడ్‌మన్ వస్తువుకు ఈ స్థాయిలో ధర పలకడం విశేషం.

ఈ క్యాప్‌కు ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 1947–48లో భారత జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా బ్రాడ్‌మన్ దీనిని ధరించాడు. ఆ తర్వాత భారత క్రికెటర్ శ్రీరంగ వాసుదేవ్ సోహోనీకి స్వయంగా బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి గత ఏడు దశాబ్దాలుగా సోహోనీ కుటుంబం మూడు తరాలపాటు ఈ క్యాప్‌ను ఎంతో జాగ్రత్తగా భద్రపరిచింది.

ఇంతకాలమైనా క్యాప్ ఏమాత్రం పాడవకుండా మంచి కండిషన్‌లో ఉండటం దీని విలువను అమాంతం పెంచింది. 2024లో వేలంలో పెట్టిన మరో బ్రాడ్‌మన్ క్యాప్ పాడైపోవడంతో కేవలం 3,11,000 డాలర్లకే అమ్ముడైంది. తాజా వేలంలోని క్యాప్ లోపల 'డి.జి. బ్రాడ్‌మన్', 'ఎస్.డబ్ల్యూ. సోహోనీ' అని చేతిరాతతో ఉండటం దీనికి మరింత ప్రామాణికతను చేకూర్చింది.

క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్‌గా పేరుగాంచిన బ్రాడ్‌మన్, 52 టెస్టుల్లో 99.94 అసాధారణ సగటుతో పరుగులు సాధించాడు. 1948లో తన చివరి ఇన్నింగ్స్‌లో మరో నాలుగు పరుగులు చేసి ఉంటే 100 సగటుతో రిటైర్ అయ్యేవారు. కానీ డకౌట్ కావడంతో ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు.

కాగా, ఈ టోపీని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో దీనిని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.
Don Bradman
Bradman baggy green cap
cricket auction
Sohoni
Australia cricket
cricket history
test series
cricket memorabilia
highest auction price
baggy green

More Telugu News