అమెరికాలో రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్లారు?... స్పందించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం

  • ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • ఆరోపణలు నిరాధారమైనవి, దురుద్దేశపూర్వకంగా చేసినవి అన్న ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అధికారికమేనని స్పష్టీకరణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక విదేశీ పర్యటనలో ఎలాంటి సమాచారం లేకుండా వ్యక్తిగత పర్యటనపై వెళ్లారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. 'తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం' అంటూ  'ఎక్స్' వేదికగా వివరణ ఇచ్చింది. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రచారమే అని తెలిపింది.

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా ముఖ్యమంత్రి అధికారికంగా ఆమోదించిన పర్యటనకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను తప్పుదారి పట్టించి గందరగోళం సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం ఇది అని పేర్కొంది. ముఖ్యమంత్రి న్యూయార్క్ పర్యటన పూర్తిగా అధికారికమేనని, అన్ని విధివిధానాలకు అనుగుణంగా సమన్వయంతో నిర్వహించారని పేర్కొంది.

ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను ముందుగానే అధికారికంగా తెలియజేసి, నిబంధనల ప్రకారమే నిర్వహించారని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. విదేశీ పర్యటనకు అవసరమైన అన్ని అనుమతులను ముందుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి పొందినట్లు వెల్లడించింది. దావోస్ నుంచి అమెరికా చేరుకున్న అనంతరం, న్యూయార్క్ విమానాశ్రయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారని తెలిపింది.

న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి ప్రయాణానికి ఎంఈఏ అధికారిక వాహనాన్ని ఏర్పాటు చేసిందని, ఇది సాధారణ దౌత్య విధానాల్లో భాగమేనని తెలిపింది. శీతాకాలంలో తీవ్ర మంచు తుపానుల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో విమాన ప్రయాణం చేయవద్దని ఎంఈఏ ముఖ్యమంత్రిని ఆదేశించిందని, వారి తదుపరి ప్రయాణాన్ని రోడ్డు మార్గంలో చేపట్టాలని తెలిపిందని గుర్తు చేసింది.

ఎంఈఏ సూచనల మేరకు, బోస్టన్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణాన్ని ఎంఈఏనే ఏర్పాటు చేసిందని, ఇందులో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ వరకు ముఖ్యమంత్రి ప్రయాణం కూడా ఉందని తెలిపింది. ఉన్నతస్థాయి విద్యా సంస్థ నిర్దేశించిన కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉండటంతో, ఈ కాలంలో ఉద్దేశ్య పూర్వకంగానే ముఖ్యమంత్రి తన కార్యక్రమాలను నిరాడంబరంగా ఉంచినట్లు ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి, బాధ్యతారహితమైనవి, అలాగే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రమేనని పేర్కొంది. దయచేసి ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అధికారులు చేసే ప్రకటనలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.


More Telugu News