Mohsin Naqvi: టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన పాకిస్థాన్... అయినా, ఆడటం అనుమానమే!
- పాకిస్థాన్ ఆడటంపై కొనసాగుతున్న సస్పెన్స్
- జట్టును ప్రకటించినంత మాత్రాన ఆడుతామని కాదంటున్న పాక్ క్రికెట్ వర్గాలు
- ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్న పాక్ బోర్డు
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పాల్గొనే విషయంపై ఇంకా అనుమానాలు కమ్ముకునే ఉన్నాయి. ఐసీసీ హెచ్చరికలు జారీ చేసినా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన వైఖరిని మార్చుకోవడం లేదు. టోర్నీలో పాల్గొనే అంశంపై ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ తెలిపారు. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించి, స్కాట్లాండ్ను చేర్చిన ఐసీసీ నిర్ణయానికి నిరసనగా, పాకిస్థాన్ కూడా టోర్నీని బహిష్కరించాలని ఆలోచిస్తోంది. "బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగింది, మేము వారిని ఒంటరిగా వదిలేయలేము" అని మొహ్సిన్ నక్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ ప్రతిస్పందన నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ జట్టును పాకిస్థాన్ ప్రకటించింది. ఇక.. టోర్నీలో పాక్ గ్యారెంటీగా ఆడుతుందని అంతా అనుకుంటుండగా... ఇక్కడే మరో మెలిక పెట్టింది. తాము జట్టును మాత్రమే ప్రకటించామని, దానర్థం టోర్నీలో తప్పకుండా ఆడుతామని కాదని పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో, టోర్నీలో పాక్ పాల్గొనడంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
అయితే, టోర్నీని బహిష్కరించకుండా... భారత్ తో మ్యాచ్ ను మాత్రమే బహిష్కరించాలని కూడా పాక్ ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.