భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆ ముగ్గురూ అడ్డుపడ్డారు.. ట్రంప్ పై సెనేటర్ విమర్శలు

  • ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు
  • అధ్యక్షుడిపై ఆరోపణలు గుప్పించిన టెక్సస్ సెనేటర్ టెడ్ క్రూజ్
  • టారిఫ్ లు వద్దన్నందుకు ట్రంప్ తనపై అరిచాడని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడి సలహాదారు పీటర్ నవారోపై టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ తో ట్రేడ్ డీల్ కు ఈ ముగ్గురూ అడ్డుపడ్డారని క్రూజ్ విమర్శించారు. టారిఫ్ లు వద్దన్నందుకు ట్రంప్ తనపై అరిచాడని, ఓ అసభ్యకరమైన పదం ఉపయోగించాడని చెప్పారు. ఈ మేరకు గతేడాది జరిగిన డోనార్ మీటింగ్ లో ప్రైవేటు దాతలతో మాట్లాడుతూ క్రూజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన దాదాపు పది నిమిషాల ఈ ఆడియో రికార్డ్ ను ఆక్సియోస్ సంస్థ వెలుగులోకి తెచ్చింది.
 
టెడ్ క్రూజ్ ఇంకా ఏంచెప్పారంటే..
ట్రంప్ సొంతపార్టీ నేత టెడ్ క్రూజ్ దాతలతో మాట్లాడుతూ.. భారత్‌ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని తాను శ్వేతసౌధంతో నిరంతరం పోరాటం చేస్తున్నానని చెప్పారు. అయితే ఈ ఒప్పందానికి పరిపాలన విభాగంలో ఎవరు అడ్డుపడుతున్నారని ఓ దాత ప్రశ్నించారు. దీనికి క్రూజ్ జవాబిస్తూ.. పీటర్ నవారో, జేడీ వాన్స్, కొన్ని సందర్భాల్లో స్వయంగా డొనాల్డ్ ట్రంపే ఈ ప్రక్రియను నిలిపి వేస్తున్నారని చెప్పారు. గతేడాది ఏప్రిల్ లో ఓ అర్ధరాత్రి పూట తాను ట్రంప్ కు ఫోన్ చేశానని, టారిఫ్ లు విధించే ఆలోచన మానుకోవాలని సూచించానని క్రూజ్ చెప్పారు.

సుంకాల వల్ల ఆర్థిక వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని, ఇప్పటికే మార్కెట్లో పలు వస్తుసేవల ధరలు 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయని చెప్పానన్నారు. ఈ ప్రభావంతో రాబోయే రోజుల్లో సెనేట్ పై, హౌస్ పై పట్టుకోల్పోతారని హెచ్చరించినట్లు తెలిపారు. అయితే, ట్రంప్ అప్పుడు తనపై అరిచారని క్రూజ్ వివరించారు. ఈ విషయంపై తన సిబ్బందితో జోక్ చేశానని, ట్రంప్ ఉపయోగించిన ఓ అసభ్య పదం మీలో ఎవరైనా ఉపయోగించి ఉంటే అప్పటికప్పుడు మిమ్మల్ని తొలగించేవాడినని చెప్పానన్నారు.


More Telugu News