అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్

  • భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్
  • అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందన్న అబ్దుల్ నజీర్
  • 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడి

చరిత్రలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దిన వేడుకలను నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు ప్రభుత్వ ప్రతిష్ఠను చాటేలా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక గౌరవ వందనం స్వీకరించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, కర్నూల్ ఏపీఎస్పీ రెండో బెటాలియన్ సహా వివిధ భద్రతా దళాలు గవర్నర్‌కు గౌరవ వందనం అందించాయి.


వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. సామాజిక పెన్షన్లకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి 63 లక్షల మందికిపైగా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చుతున్నట్లు వెల్లడించారు. ‘దీపం’ పథకం ద్వారా పేద మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఆర్థిక భారం తగ్గించామని తెలిపారు.


ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. నీటి భద్రతను ప్రధాన విధానంగా తీసుకుని పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ‘పొలం పిలుస్తోంది’, ‘రైతన్న మీ కోసం’ వంటి కార్యక్రమాల ద్వారా నేరుగా మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు.


రవాణా రంగంలో రోడ్డు, రైల్వే, జల రవాణాకు సమాన ప్రాధాన్యం ఇస్తూ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పూడ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు విశాఖను ఎకనామిక్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ చార్జీల అమలుతో వినియోగదారులపై భారం తగ్గించామని వివరించారు.


ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం, ప్లగ్ అండ్ ప్లే విధానం, టూరిజం పాలసీ 2024–29 అమలు, స్వచ్ఛ ఆంధ్ర – సేఫ్ ఆంధ్ర కార్యక్రమాలు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఏఐ టెక్నాలజీపై దృష్టి వంటి అంశాలను గవర్నర్ ప్రస్తావించారు. 2047 ‘స్వర్ణ ఆంధ్ర’ విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు.


మొత్తంగా అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రానికి కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టుగా, అభివృద్ధి, సంక్షేమాలపై ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబించేలా నిలిచాయి.



More Telugu News