Werner Herzog: 19 ఏళ్ల తర్వాత వైరల్ అవుతున్న ‘ఒంటరి పెంగ్విన్’ వీడియో!

Werner Herzog Penguin Video Viral After 19 Years
  • ట్రెండింగ్‌లో 2007 నాటి 'ఎన్‌కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్' డాక్యుమెంటరీ క్లిప్  
  • ఆహారం, ఆశ్రయం కోసం వెళ్లకుండా.. ఒంటరిగా పర్వతాల వైపు వెళ్తున్న పెంగ్విన్
  • ఆధునిక కాలంలోని ఒంటరితనం, శూన్యవాదానికి ఈ పెంగ్విన్ ప్రతీక అంటున్న నెటిజన్లు
  • ఈ వీడియో ఆధారంగా వేల సంఖ్యలో మీమ్స్, ఫిలాసఫికల్ చర్చలు  
కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు కొత్త అర్థాలను వెతుక్కుంటాయి. 2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అందరూ ఒకవైపు వెళ్తుంటే తను మాత్రం ఎటు వెళ్తున్నదో తెలియని ఒక దిశలో, మంచు కొండల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెంగ్విన్ వీడియో ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

సాధారణంగా పెంగ్విన్లు గుంపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి, మృత్యువు పొంచి ఉందని తెలిసినా ఆకాశాన్ని తాకే మంచు పర్వతాల వైపు వెళ్తుంటుంది. దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా అది మళ్లీ పర్వతాల వైపుకే దారి తీస్తుంది. ఈ దృశ్యం చూస్తుంటే ఆ పెంగ్విన్‌కు జీవితంపై విరక్తి కలిగిందా? లేక దానికి పిచ్చి పట్టిందా? అనే అనుమానం కలుగుతుంది.

ప్రస్తుత కాలంలో మనుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం, ‘ఏమీ లేని శూన్యం’ అనే భావనలకు ఈ పెంగ్విన్ ఒక గుర్తుగా మారింది. "మేమంతా ఆ పెంగ్విన్ లాంటి వాళ్లమే.. ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, టెక్‌టాక్ లలో ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

ఈ వైరల్ వీడియో పుణ్యమా అని 19 ఏళ్ల క్రితం వచ్చిన ఆ డాక్యుమెంటరీని ఇప్పుడు మళ్లీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో జనం ఎగబడి చూస్తున్నారు. సైకాలజిస్టులు సైతం ఈ వీడియోపై స్పందిస్తూ.. ప్రకృతిలో కూడా ఇలాంటి అసాధారణ ప్రవర్తనలు ఉంటాయని, అది మనుషులకు ఒక అద్దం పట్టినట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు. 
Werner Herzog
Penguin
Viral video
Documentary
Existentialism
Loneliness
Mental health
Nature
Animal behavior
Internet sensation

More Telugu News