Rangareddy: యాచారంలో కారు బీభత్సం.. ఎస్సైని బ్యానెట్‌పై అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు!

Rangareddy Drunk and Drive SI Madhu Dragged on Car Bonnet
  • డ్రంకెన్‌ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు కారుతో యువ‌కుడి బీభత్సం
  • ఎస్సైని ఢీకొట్టి బ్యానెట్‌పై అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన వైనం
  • ఈ క్రమంలో ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలు
  • పరారైన నిందితులను ఇబ్రహీంపట్నం వద్ద పట్టుకున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రంకెన్‌ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు తన కారుతో ఎస్సైని ఢీకొట్టి, దాదాపు అర కిలోమీటర్ దూరం బ్యానెట్‌పైనే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. యాచారం బస్టాండ్ వద్ద పోలీసులు ఆదివారం రాత్రి డ్రంకెన్‌ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వేగంగా వస్తున్న కారును ఆపాలని పోలీసులు చూశారు. డ్రైవర్ కారును ఆపకపోవడంతో ఎస్సై మధు వాహనానికి అడ్డంగా నిలబడ్డారు. అయినా ఆగకుండా డ్రైవర్ కారుతో ఎస్సైని ఢీకొట్టడంతో ఆయన బ్యానెట్‌పై పడిపోయారు. అయినప్పటికీ నిందితుడు కారును ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు.

ఈ క్రమంలోనే ఓ బైక్‌ను కూడా ఢీకొట్టడంతో వెంకట్ రెడ్డి, ఆయన కోడలు దివ్య, మనవడికి గాయాలయ్యాయి. దివ్య చేయి విరిగింది. యాచారం దాటిన తర్వాత కారు వేగం తగ్గడంతో ఎస్సై మధు బ్యానెట్‌పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

యాచారం పోలీసుల సమాచారంతో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద పోలీసులు కారును అదుపులోకి తీసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. కారు నడిపిన వ్యక్తిని కోహెడకు చెందిన శ్రీకర్‌గా, పక్కన ఉన్న వ్యక్తిని హయత్‌నగర్‌కు చెందిన అతని స్నేహితుడు నితిన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Rangareddy
SI Madhu
Yacharam
Drunk and drive
Rangareddy district
Road accident
Car accident
Telangana police
Crime news
Hit and run

More Telugu News