Gottipati Ravi Kumar: ఏపీ సీఎం చంద్రబాబు సంస్కరణలతోనే డిస్కంలకు దేశ స్థాయిలో మెరుగైన రేటింగ్‌: మంత్రి గొట్టిపాటి

Gottipati Ravi Kumar says AP discoms get better ratings due to Chandrababus reforms
  • వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవనం పోసిందన్న మంత్రి గొట్టిపాటి
  • గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందని ఆరోపణ
  • రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలను యూనిట్‌పై రూ.1.19 మేర తగ్గించే దిశగా కృషి చేస్తున్నామని వెల్లడి
వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవం పోసిందని ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టిన సమగ్ర విద్యుత్ సంస్కరణల ఫలితంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) దేశ స్థాయిలో మెరుగైన రేటింగ్‌లు సాధించాయని తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో రాష్ట్ర డిస్కంల పనితీరుకు ఉన్నత రేటింగ్‌లు లభించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందని, అప్పుల ఊబిలో ముంచి డిస్కంలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి గుర్తు చేశారు. సాంకేతిక, వాణిజ్య నష్టాలను గణనీయంగా తగ్గించడం, విద్యుత్ బిల్లుల వసూలు సామర్థ్యాన్ని పెంచడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలను జాప్యం లేకుండా విడుదల చేయడం వంటి చర్యలతో డిస్కంల పనితీరు మెరుగుపడిందన్నారు. ఇవే దేశ స్థాయిలో రేటింగ్‌లు పెరగడానికి కారణమని స్పష్టం చేశారు. ఈ విజయానికి కారణమైన విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఇంజినీర్లు, ఫీల్డ్ సిబ్బందిని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో, రెట్టింపు ఉత్సాహంతో పని చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో డిస్కంల రేటింగ్‌లు మరింత మెరుగయ్యేలా అదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు.

గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలను యూనిట్‌పై రూ.1.19 మేర తగ్గించే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా కృషి చేస్తోందని వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ప్రజలపై భారం తగ్గించే విధానాలనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. 
Gottipati Ravi Kumar
Andhra Pradesh
AP discoms
Chandrababu Naidu
electricity sector
power finance corporation
power distribution companies
electricity charges
AP electricity reforms

More Telugu News