ఎస్ఏ20: మూడోసారి సింహాసనంపై సన్‌రైజర్స్.. మళ్లీ ఛాంపియన్స్‌గా ఆరెంజ్ ఆర్మీ!

  • నాలుగేళ్లలో మూడుసార్లు టైటిల్ గెలిచి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 
  • ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ శతకం బాదినా జట్టుకు తప్పని ఓటమి
  • 48 పరుగులకే 4 వికెట్లు పడి ఓటమ అంచుల్లోకి సన్‌రైజర్స్
  • బ్రీట్జ్కే-స్టబ్స్ వీరోచిత పోరాటంతో విజయం ఖరారు
దక్షిణాఫ్రికా గడ్డపై 'ఆరెంజ్' జెండా మళ్లీ రెపరెపలాడింది. ఎస్ఏ20 లీగ్ నాలుగో సీజన్ ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, మరోసారి ట్రోఫీని ముద్దాడింది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ లీగ్‌లో ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచి, తామే 'అన్ బీటబుల్' అని ఈస్టర్న్ కేప్ నిరూపించుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్‌కు డెవాల్డ్ బ్రెవిస్ వెన్నెముకగా నిలిచాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడి 101 పరుగులతో మెరుపు శతకం బాదాడు. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రిటోరియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. కేవలం 48 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మాథ్యూ బ్రీట్జ్కే (68 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (63 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆరో వికెట్‌కు అజేయమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చారు. గత ఏడాది (2025) ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్, ఈసారి మాత్రం కసిగా ఆడి ట్రోఫీని చేజిక్కించుకుంది. 


More Telugu News