అదృష్టం అంటే స్కాట్లాండ్‌దే... ఐసీసీ నుంచి బంపర్ ఆఫర్

  • 2026 టీ20 ప్రపంచకప్‌లో ఊహించని మార్పు
  • భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్
  • బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు చోటు కల్పించిన ఐసీసీ
  • ఐసీసీ ఆఫర్‌ను వెంటనే అంగీకరించిన క్రికెట్ స్కాట్లాండ్
  • గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో తలపడనున్న స్కాట్లాండ్
స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు జాక్‌పాట్ తగిలింది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆడాలంటూ ఐసీసీ అధికారికంగా స్కాట్లాండ్ జట్టును ఆహ్వానించింది. ఈ బంపర్ ఆఫర్ కు స్కాట్లాండ్ వెంటనే ఆమోదం తెలిపింది. అంతేకాదు, ఆ జట్టు హుటాహుటీన భారత్‌కు బయలుదేరనుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2009లో రాజకీయ కారణాలతో జింబాబ్వే తప్పుకోవడంతో అప్పుడు కూడా స్కాట్లాండ్‌కే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశమే వారి తలుపు తట్టింది.

ఈ మార్పుతో స్కాట్లాండ్ జట్టు గ్రూప్-సిలో చేరింది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. స్కాట్లాండ్ తన మూడు మ్యాచ్‌లను కోల్‌కతాలో, ఒక మ్యాచ్‌ను ముంబైలో ఆడనుంది. వాస్తవానికి, ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో స్కాట్లాండ్ (14) మెరుగైన ర్యాంకులో ఉంది. అందుకే ఐసీసీ నుంచి వారికి ఈ పిలుపు వచ్చింది. 

ఈ పరిణామంపై క్రికెట్ స్కాట్లాండ్ చైర్ విల్ఫ్ వాల్ష్ స్పందిస్తూ, "ఐసీసీ చైర్మన్ జై షా ఈరోజు నాకు ఫోన్ చేసి టీ20 ప్రపంచకప్‌లో ఆడాల్సిందిగా ఆహ్వానించారు. మా జట్టు తరఫున ఈ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించాను. మా ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ఐసీసీకి ధన్యవాదాలు" అని ఓ ప్రకటనలో తెలిపారు.

వాస్తవానికి ఈ మెగా ఈవెంట్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. అయితే, తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భద్రతా కారణాలను చూపుతూ, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని లేదా ఐర్లాండ్‌తో గ్రూపులను పరస్పరం మార్చాలని ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది. తమ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి మధ్యలోనే విడుదల చేసిన నేపథ్యంలో ఈ మేరకు బీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. 

అయితే, బీసీబీ చేసిన ప్రతిపాదనలను ఐసీసీ తిరస్కరించింది. భారత్ లో భద్రతకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ స్పష్టం చేయడంతో, ర్యాంకుల ప్రకారం స్కాట్లాండ్‌కు ఈ అవకాశం దక్కింది.





More Telugu News