Ramachander Rao: ఫోన్ ట్యాపింగ్ అంశం... కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రామచందర్ రావు ఆగ్రహం

Ramachander Rao Angered Over Phone Tapping Issue on Congress BRS
  • కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపణ
  • అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఫోన్ ట్యాపింగ్ డ్రామాకు తెరలేపాయని విమర్శ
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ ఉల్లంఘన అని అన్నారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఫోన్ ట్యాపింగ్ డ్రామాకు తెరలేపాయని విమర్శించారు.

ఈ కేసులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌తో నష్టపోయిన వారికి న్యాయం జరగాలంటే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతం కావాలని, బాధ్యులపై త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో భారతరత్న కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడారు. కర్పూరీ ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఉచిత విద్య, రిజర్వేషన్లు, రైతు సంక్షేమం వంటి అనేక సంస్కరణలను దశాబ్దాల క్రితమే అమలు చేసిన గొప్ప నాయకుడు అన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం అందించిందని గుర్తుచేశారు.
Ramachander Rao
Telangana BJP
Phone Tapping Case
BRS
Congress
Telangana Politics
Karpoori Thakur

More Telugu News