KTR: బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

KTR Sends Legal Notices to Bandi Sanjay Dharmapuri Arvind
  • వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • నిరాధార, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న కేటీఆర్
  • బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆల్ లీగల్ నోటీసులు పంపించారు. బీజేపీ నేతలకు వేర్వేరుగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

ఇరువురు నేతలు కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ అన్నారు. తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఉద్దేశపూర్వకంగానే వారు తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని కేటీఆర్ తెలిపారు. రాజకీయాల కోసం వారు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, అరవింద్‌లకు తన న్యాయవాదులతో నోటీసులను పంపించారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు ఆర్జించిందని, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేశారని బండి సంజయ్ నిన్న ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తోందని, అయినప్పటికీ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆయనకు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. డ్రగ్స్ సేవిస్తున్నారని, సరఫరా చేస్తున్నారని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
KTR
Bandi Sanjay
Dharmapuri Arvind
BRS
BJP
Legal Notice
Defamation
Telangana Politics
Phone Tapping

More Telugu News