అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ హ్యాట్రిక్ విజయం... సూపర్ సిక్స్‌లోకి ఎంట్రీ

  • న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలుపు
  • వర్షం కారణంగా డీఎల్‌ఎస్ పద్ధతిలో కుదించిన మ్యాచ్
  • కెప్టెన్ ఆయుష్ మాత్రే మెరుపు అర్ధశతకం
  • 4 వికెట్లతో చెలరేగిన బౌలర్ ఆర్ఎస్ అంబరీష్
అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత యువ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్-బిలో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నీలో యంగ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి, గ్రూప్ టాపర్‌గా నిలిచింది. తద్వారా సూపర్ సిక్స్ బెర్తును ఖాయం చేసకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను పలుమార్లు కుదించాల్సి వచ్చింది.

బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 36.2 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ 29 పరుగులిచ్చి 4 వికెట్లతో సత్తా చాటగా, హెనిల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. కివీస్ జట్టులో కాలమ్ శామ్సన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం, వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 130 పరుగులుగా నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు కేవలం 13.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (27 బంతుల్లో 53 పరుగులు) మెరుపు అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (23 బంతుల్లో 40) వేగంగా ఆడి విజయాన్ని సులభతరం చేశాడు.




More Telugu News