బాలికల విషయంలో ఇప్పటికీ సమాజ దృక్పథంలో మార్పు రావాల్సి ఉంది: కందుల దుర్గేశ్

  • బాలికల పట్ల అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్న కందుల దుర్గేశ్
  • వారు ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా తీర్చిదిద్దాలని వ్యాఖ్య
  • వారి భద్రత విషయంలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని హెచ్చరిక

సమాజంలో బాలికల భద్రత, వారి చదువు, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. బాలికల విషయంలో ఇప్పటికీ సమాజ దృక్పథంలో మార్పు రావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిడదవోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘జాతీయ బాలికా దినోత్సవం’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడపిల్లలను కేవలం కాపాడుకోవడమే కాదు, వారిని ఉన్నత విద్యావంతులుగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులు, సమాజం అందరిపైనా ఉందన్నారు.


బాలికల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు వంటి వాటికి గురికాకుండా కాపాడటం అత్యంత కీలకమని చెప్పారు. బాలికల హక్కుల పరిరక్షణలో తల్లిదండ్రులు మాత్రమే కాదు... అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా భాగస్వాములేనని మంత్రి గుర్తు చేశారు. బాలికల భద్రత విషయంలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని హెచ్చరించారు.



More Telugu News