Bandi Sanjay: సింగరేణి రికార్డులను వెంటనే సీజ్ చేయాలి: బండి సంజయ్

Bandi Sanjay Demands Seizure of Singareni Records
  • గతంలో సింగరేణిని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్న బండి సంజయ్
  • ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు అదే పనిలో ఉన్నారని ఆరోపణ
  • రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని వ్యాఖ్య

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీలూ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు అదే పనిలో ఉన్నారని ఆరోపించారు. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు.


కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ లేఖ రాస్తే... బీఆర్ఎస్ అవినీతిపై విచారణ జరుపుదామా అని మంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానిస్తున్నారని... ఇదంతా చూస్తే రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అర్థమవుతోందని బండి సంజయ్ అన్నారు. సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన గనుల కేటాయింపులు, దోపిడీపై పూర్తిస్థాయి విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో దోపిడీపై ప్రశ్నిస్తే గుజరాత్‌ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.


తెలంగాణ సాధన కోసం సింగరేణి కార్మికులు పోరాటాలు చేస్తే... ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడు మరింత ఎక్కువగా గనుల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలయాపన చేయకుండా సింగరేణికి సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే సీజ్ చేయాలని కోరారు. ఆలస్యం జరిగితే అవి తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి చెల్లించాల్సిన రూ.42 వేల కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


కేసీఆర్ పాలనలో సింగరేణిని అప్పులపాలు చేసి, దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్ పార్టీని నడిపించారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తీసుకొస్తామంటూ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ నిధులను మళ్లించడం పరిపాటిగా మారిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మేయర్, ఛైర్మన్ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.


ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్‌ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతుంటే, అసలు దోషులను సాక్షులుగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇలా చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేసిన అసలు నిందితులను కాపాడుతున్నట్టేనని ఆరోపించారు. సిట్‌పై ప్రభుత్వ ఒత్తిడి ఉంటే దాని విశ్వసనీయత కోల్పోతుందని హెచ్చరించారు.


కేటీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెబుతున్న కేసీఆర్, కేటీఆర్ దేవాలయంలో కుటుంబంతో కలిసి ప్రమాణం చేసే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. హీరోయిన్లు, వ్యాపారులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల నంబర్లను కూడా మావోయిస్టుల జాబితాలో పెట్టి ట్యాపింగ్ చేయలేదా? అని నిలదీశారు.

Bandi Sanjay
Singareni Collieries
Telangana
BRS
Congress
Corruption
Phone Tapping
KTR
KCR
Investigation

More Telugu News