ఒక వైపున వరుసగా తమిళంలో సినిమాలు చేస్తూనే .. టాలీవుడ్ పై దృష్టి పెడుతూనే, అడపాదడపా ధనుష్ బాలీవుడ్ సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన తాజా సినిమానే 'తేరే ఇష్క్ మే'. ఈ రొమాంటిక్ డ్రామా, క్రితం ఏడాది నవంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. కృతి సనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, దాదాపు 150 కోట్ల వరకూ వసూలు చేసింది. తెలుగులోనూ 'అమరకావ్యం' పేరుతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా హిందీతో పాటు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

శంకర్ (ధనుష్) దిగువ మధ్యతరగతికి చెందిన యువకుడు. చిన్నతనంలో తల్లిని కొల్పోయిన అతనికి ఆ లోటు తెలియకుండా తండ్రి రాఘవ (ప్రకాశ్ రాజ్) పెంచుతాడు. ఓ సాధారణ లాయర్ గా అతను తన కొడుకుతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. శంకర్ కి మొదటి నుంచి కోపం చాలా ఎక్కువనే. కోపం వస్తే అతనిని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటి ఆ కాలేజ్ కి ముక్తి ( కృతి సనన్) వస్తుంది. శంకర్ ధోరణి ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

ముక్తి ఒక పీహెచ్ డి విద్యార్థిని. తాను ఎంచుకున్న అంశానికి, శంకర్ కోపానికి సంబంధం ఉంటుంది. తన థీసిస్ ఆమోదం పొందడం కోసం ఆమె శంకర్ తో సన్నిహితంగా ఉండవలసి వస్తుంది. ఆమె కోసం తన కోపాన్ని నియంత్రించుకోవడానికి సిద్ధపడిన శంకర్, నిజంగానే ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. తమ ప్రేమ పట్ల నమ్మకంతోనే, ముక్తి తండ్రి యశ్వంత్ ఎదురుగా కూర్చుంటాడు. ఆయన శంకర్ స్థాయిని గుర్తుచేస్తూ అవమానిస్తాడు.  

దాంతో శంకర్ లో పట్టుదల పెరిగిపోతుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఏ అర్హత అయితే ఉండాలని యశ్వంత్ ఆశిస్తున్నాడో, ఆ అర్హతను సంపాదించుకుని తిరిగొస్తానని శంకర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శంకర్ తాను అనుకున్నది సాధించగలుగుతాడా? ముక్తితో అతని వివాహం జరుగుతుందా? ప్రేమను పొందే క్రమంలో శంకర్ కోల్పోయేదేమిటి? అనేది మిగతా కథ.

హిమాన్షు శర్మ - నీరజ్ యాదవ్ తయారు చేసిన కథ ఇది. ఆనంద్ ఎల్ రాయ్ ఈ కథను తెరపై ఆవిష్కరించాడు. ప్రేమ యుద్ధంలో అలసిపోయిన ఒక సాధారణ యువకుడు, నిజమైన యుద్ధంలో పాల్గొనడానికి ఎంత మాత్రం వెనుకాడకపోవడమే ప్రధానమైన కథాంశంగా సాగే సినిమా ఇది. ప్రేమ బీజం మొలకెత్తిన తరువాత అది మహావృక్షంగా మారడానికి ఎక్కువ కాలం పట్టదు. దానంతట అది దహించబడటమే తప్ప, ఎవరూ పెకిలించలేరు అని చాటిచెప్పే కంటెంట్ ఇది. 
 
ఓ గొప్పింటి అమ్మాయికి .. పేదింటి యువకుడికి మధ్య నడిచే ప్రేమకథనే ఇది. ఆ ప్రేమను ఆమె లైట్ గా తీసుకోవడం .. అతగాడు సీరియస్ గా తీసుకుకోవడం .. ఆమె తండ్రి ఇంటికి పిలిచి అవమానించడం .. అనుకున్నది సాధించాకనే తిరిగొస్తానని హీరో రుసరుసలాడుతూ వెళ్లిపోవడం.. వంటి సన్నివేశాలు రొటీన్ గా వచ్చి వెళ్లేవే .. చూసి చూసి అలసిపోయినవే. అందువలన అలాంటి సీన్స్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. 

ధనుష్ పాత్రలో ఎంతోకొంత క్లారిటీ కనిపిస్తుంది. కృతి సనన్ పాత్రను డిజైన్ చేసిన విషయంలో మనకి క్లారిటీ కనిపించదు. ఆమె ప్రేమిస్తున్నట్టు నటించిందా? నటించడం మరిచిపోయి ప్రేమించిందా? అనేది సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు. 'ఉంటే వదలదు .. పోతే తలవదు' అనే తరహాలో ఆమె పాత్ర అయోమయానికి గురిచేస్తుంది. ప్రకాశ్ రాజ్ - ధనుష్ కి సంబంధించిన తండ్రీ కొడుకుల ఎమోషన్స్ కొంతవరకూ కనెక్ట్ అవుతాయి.    

ప్రేమ కథల్లో ప్రేక్షకులు లీనం కావాలంటే ఆ కథలో ఆత్మ ఉండాలి .. ఊపిరి ఉండాలి. ఫీల్ లేని ప్రేమకథలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేవు. అలాంటి ఫీల్ ఈ కథలో లోపించడం మనకి కనిపిస్తుంది. ప్రేమ - తిరస్కరణ - ఆవేశం - అనర్థం అన్నట్టుగానే ఈ కథ నడుస్తుంది. తెరపై హీరో - హీరోయిన్స్ హ్యాపీగా లేనప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. ఇక సన్నివేశాలను సాగదీస్తూ వెళితే మరింత డీలాపడతారు. ఈ కథ విషయంలో అదే జరిగింది. 

ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేమలో ఓడిపోయినవాడి పోరాటం ఎప్పటికీ ఒంటరిదే అనే కోణంలో, ఆయన నటనకి మంచి మార్కులు దక్కుతాయి. కృతి సనన్ కూడా బాగా చేసింది. ఆమె గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ అయింది. దిగువ మధ్యతరగతి తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటన కూడా ఆకట్టుకుంటుంది. నిడివి తక్కువే అయినా ముక్తి తండ్రి పాత్రను పోషించిన తోట రాయ్ చౌదరి బాగా చేశారు. తుషార్ కాంతి రే ఫొటోగ్రఫీ .. ఎఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం .. హేమల్ ఎడిటింగ్ ఫరవాలేదు.

ఇది ప్రేమకథనే అయినా యూత్ ను ప్రభావితం చేసే అంశాలేవీ ఇందులో కనిపించవు. ఎందుకంటే రొటీన్ లైన్ ను ఎంచుకోవడం .. సన్నివేశాలను సాగదీస్తూ చెప్పడమే అందుకు కారణంగా భావించవచ్చు. మనసులను కదిలించే .. కరిగించే స్థాయిలో బలమైన సన్నివేశాలు లేని ఈ సినిమా, ఓ మాదిరిగా కంటెంట్ అనే అనిపించుకుంటుంది.