విజయవాడ ఫుడ్ ట్రెండ్స్... బిర్యానీ తర్వాత అత్యధిక ఆర్డర్లు దానికే!

  • స్విగ్గీ 2025 వార్షిక సర్వేలో విజయవాడ ఫుడ్ హ్యాబిట్స్
  • 7.78 లక్షల ఆర్డర్లతో అగ్రస్థానంలో నిలిచిన చికెన్ బిర్యానీ
  • 3.2 లక్షల ఆర్డర్లతో అనూహ్యంగా రెండో స్థానంలో ఇడ్లీ
  • మూడో స్థానంలో నిలిచిన వెజ్ దోశ
  • పంజాబీ, బెంగాలీ వంటకాలపై 35 శాతం పెరిగిన ఆసక్తి
తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియుల ఫేవరెట్ అనగానే చికెన్ బిర్యానీనే గుర్తుకొస్తుంది. విజయవాడ వాసులు కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విడుదల చేసిన 2025 వార్షిక నివేదికలోనూ ఇదే విషయం స్పష్టమైంది. అయితే, బిర్యానీ తర్వాత బెజవాడ వాసులు అత్యధికంగా ఇష్టపడింది ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అదే మెత్తటి, తెల్లటి ఇడ్లీ.

స్విగ్గీ వెల్లడించిన వివరాల ప్రకారం... 2025 జనవరి 1 నుంచి నవంబర్ 30 వరకు విజయవాడలో ఏకంగా 7.78 లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా, ఈసారి కూడా బిర్యానీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత 3.2 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ రెండో స్థానంలో నిలవడం విశేషం. సాధారణంగా టిఫిన్ ఐటమ్స్‌లో దోశకు ఎక్కువ ఆదరణ ఉంటుందనే అంచనాలను పక్కకు నెడుతూ ఇడ్లీ టాప్-2లో చోటు దక్కించుకుంది. ఇక, 2.7 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ మూడో స్థానాన్ని దక్కించుకుంది.

సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు
ఈ సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. విజయవాడ వాసుల ఆహార అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయని నివేదిక సూచిస్తోంది. ముఖ్యంగా బెంగాలీ, పంజాబీ వంటకాల వైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. 2024తో పోలిస్తే 2025లో ఈ వంటకాల ఆర్డర్లు 30 నుంచి 35 శాతం పెరిగినట్లు స్విగ్గీ పేర్కొంది. ఇది నగరంలో మారుతున్న ఫుడ్ కల్చర్‌కు అద్దం పడుతోంది.

వీటితో పాటు స్నాక్స్ విభాగంలో నాన్-వెజ్ ప్రియులు చికెన్ ఫ్రై, చికెన్ బర్గర్, పిజ్జాలను ఇష్టపడుతుండగా, శాఖాహారులు ఉల్లి దోశ, వడ, పూరీ వంటి వాటిని ఆర్డర్ చేస్తున్నారు. ఇక స్వీట్ల విషయానికొస్తే పూర్ణం బూరెలు, బొబ్బట్లు, గులాబ్ జామూన్ వంటి సంప్రదాయ రుచులకే బెజవాడ ఓటేసింది. మొత్తంగా బిర్యానీపై ప్రేమ తగ్గకపోయినా... ఇడ్లీకి అనూహ్యంగా ఆదరణ పెరగడం, కొత్త వంటకాలను స్వాగతించడం విజయవాడ ఫుడ్ లవర్స్ ప్రత్యేకతగా నిలుస్తోంది.


More Telugu News