ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశానికి డుమ్మా కొట్టడంపై శశి థరూర్ వివరణ

  • ఢిల్లీలో జరిగిన కీలక కాంగ్రెస్ సమావేశానికి శశి థరూర్ గైర్హాజరు
  • పార్టీలో విభేదాలంటూ వచ్చిన ఊహాగానాలకు తెరదించిన థరూర్
  • సమావేశానికి హాజరు కాలేనని అధిష్టానానికి ముందే సమాచారం ఇచ్చానని వెల్లడి
  • కోజికోడ్‌లో సాహిత్య ఉత్సవం కారణంగానే రాలేకపోయానని స్పష్టీకరణ
  • పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించనని తేల్చిచెప్పిన థరూర్
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి తాను గైర్హాజరు కావడంపై వస్తున్న ఊహాగానాలకు సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తెరదించారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, సమావేశానికి హాజరు కాలేనని పార్టీ నాయకత్వానికి ముందే సమాచారం ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో కేరళ కాంగ్రెస్ నేతలతో పార్టీ కేంద్ర నాయకత్వం ఒక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి థరూర్ హాజరు కాకపోవడంతో పార్టీలో విభేదాలున్నాయంటూ మరోసారి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటీవల కొచ్చిలో రాహుల్ గాంధీ పాల్గొన్న ఒక సమావేశంలో తనకు ఎదురైన అనుభవంతో థరూర్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఢిల్లీ సమావేశానికి రాలేదని కథనాలు వెలువడ్డాయి. దానికి తోడు, కేరళలో ప్రధాని మోదీ పర్యటన కూడా ఉండడంతో, కాంగ్రెస్ హై లెవల్ భేటీకి థరూర్ డుమ్మా కొట్టారని వార్తలు వచ్చాయి.

ఈ ప్రచారంపై శనివారం కోజికోడ్‌లో మీడియాతో మాట్లాడుతూ థరూర్ స్పందించారు. "నేను చెప్పాలనుకున్నది పార్టీ నాయకత్వానికి చెప్పాను. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించడం సరికాదు" అని అన్నారు. మీడియాలో వచ్చే వార్తల్లో కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు ఉండవచ్చని... దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సూచించారు.

ఢిల్లీ సమావేశానికి రాలేకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ, "కోజికోడ్‌లో నా తాజా పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సాహిత్య ఉత్సవానికి హాజరు కావాల్సి ఉన్నందున ఢిల్లీ రాలేనని ముందే హైకమాండ్ కు తెలియజేశాను. గతంలో రాజకీయ కార్యక్రమాల వల్ల జైపూర్ సాహిత్య ఉత్సవాన్ని వదులుకున్నాను. ఈసారి అలా జరగకూడదనే ఇక్కడికి వచ్చాను" అని థరూర్ వివరించారు. ఈ విషయంపై సీడబ్ల్యూసీ సభ్యుడు రమేశ్ చెన్నితాల కూడా స్పందిస్తూ.. థరూర్ కేవలం రాజకీయ నాయకుడే కాదని, గొప్ప సాహిత్యవేత్త అని, ఈ విషయాన్ని ఆ కోణంలోనే చూడాలని అన్నారు.


More Telugu News