వివాదంలో 'బలగం' వేణు..!
- 'ఎల్లమ్మ' సినిమాతో బిజీగా ఉన్న వేణు
- ఆలయ ప్రాంగణంలో షూ వేసుకుని ఉన్న వేణు ఫొటోలు వైరల్
- క్షమాపణ చెప్పాలంటున్న నెటిజన్లు
‘బలగం’ వంటి సున్నితమైన, గుండెను తాకే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు, నటుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’తో ఫుల్ బిజీగా ఉన్నారు. తెలంగాణ సంస్కృతి, భక్తి భావాలను నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్శి’ అనే పవర్‌ఫుల్ మాస్ పాత్రలో పరిచయం చేయడం ఇప్పటికే పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
ఇలాంటి సమయంలో ‘ఎల్లమ్మ’ షూటింగ్‌కు సంబంధించిన ఓ తాజా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. వేణు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు అనుకోకుండా వివాదానికి దారి తీశాయి. ఆ ఫొటోల్లో తెలంగాణలోని ఒక పురాతన ఆలయ ప్రాంగణంలో షూటింగ్ జరుగుతున్నట్లు కనిపించగా, అక్కడ వేణు షూస్ వేసుకుని ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో షూస్ ధరించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అంటూ కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో ఈ అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఒక వర్గం మాత్రం వేణును సమర్థిస్తోంది. సినిమా షూటింగ్ సమయంలో భారీ లైటింగ్ సెటప్‌లు, ఎలక్ట్రికల్ వైర్లు, ఇతర సాంకేతిక పరికరాలు ఉండటంతో భద్రత కోసమే షూస్ వేసుకోవాల్సి వస్తుందని వారు వాదిస్తున్నారు. ఇది అవమానించే ఉద్దేశంతో చేసిన పని కాదని, పూర్తిగా సేఫ్టీ కారణాల వల్లే జరిగిందని చెబుతున్నారు.
ఏదేమైనా, ‘బలగం’తో అందరినీ ఒక్కటిగా చేసిన వేణు యెల్దండి, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ షూటింగ్ ఫొటోల కారణంగా వివాదంలో చిక్కుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.