'టీ హబ్‌'పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • టీ హబ్‌ను స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని సీఎం ఆదేశం
  • ప్రభుత్వ ఆఫీసులను తరలిస్తున్నారన్న వార్తలపై స్పందించిన రేవంత్ రెడ్డి
  • అమెరికా పర్యటన నుంచే సీఎస్‌కు ఫోన్ చేసి సూచనలు
  • టీ హబ్‌లో ఇతర కార్యాలయాలు వద్దని స్పష్టం చేసిన సీఎం
టీ హబ్‌ను ఒక ప్రత్యేక స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని, అందులోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న కొన్ని ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్‌కు మారుస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు ఫోన్ చేసి మాట్లాడారు. టీ హబ్‌ను స్టార్టప్‌ల కోసం ఒక ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. దాని స్వరూపాన్ని మార్చేలా ఇతర కార్యాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలుంటే వెంటనే విరమించుకోవాలని ఆదేశించారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సీఎం సూచించారు. ఏ పరిస్థితుల్లోనూ టీ హబ్ ప్రాధాన్యతను తగ్గించవద్దని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News