కొత్త చాప్టర్ ప్రారంభమైంది: సుస్మిత కొణిదెల

  • రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసిన 'మన శంకర వరప్రసాద్ గారు'
  • ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సుస్మిత కొణిదెల
  • తన నిర్మాణ సంస్థ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సుస్మిత

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ తార స్థాయిలో ఉంటుంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు... థియేటర్లు పండుగ వాతావరణంతో నిండిపోతాయి. అలాంటి అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది.


సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే కామెడీ, మెగాస్టార్ మాస్ టైమింగ్, భావోద్వేగాలకు తగ్గ కథనం కలిసి సినిమాకు బలంగా నిలిచాయి. దీనికి తోడు విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు అదనపు ఆకర్షణగా మారింది.


బాక్సాఫీస్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రాంతీయ చిత్రాల చరిత్రలోనే అరుదైన రికార్డులను నమోదు చేస్తూ, సంక్రాంతి సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 


ఇక ఈ ఘన విజయం నిర్మాతలకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించిన సుస్మిత కొణిదెల, తన నిర్మాణ సంస్థ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ‘న్యూ చాప్టర్ బిగిన్స్’ అంటూ సోషల్ మీడియా ద్వారా ఆఫీస్ ఫొటోలు షేర్ చేస్తూ, భవిష్యత్తులో ఈ బ్యానర్ నుంచి మరిన్ని భారీ సినిమాలు రాబోతున్నాయని సంకేతాలు ఇచ్చారు. షైన్ స్క్రీన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించిన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, తొలి ప్రయత్నంలోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.



More Telugu News