ఇన్ స్టాలో పరిచయమైన బాలుడి కోసం ఇల్లు విడిచి వెళ్లిన బాలిక.. విజయవాడ రూరల్​ మండలంలో ఘటన

  • పామర్రు నియోజకవర్గంలోని బాలుడి ఇంటికి వెళ్లిన బాలిక..
  • అడ్రస్ అడిగితే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపు
  • బాలిక కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లి
విజయవాడ రూరల్ మండలంలో ఓ బాలిక ఇల్లు విడిచి వెళ్లడం కలకలం రేపింది. అమ్మమ్మ ఇంటి నుంచి అమ్మ దగ్గరికి వెళతానంటూ బయలుదేరిన 16 ఏళ్ల బాలిక ఇన్ స్టాలో పరిచయమైన బాలుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది. బాలిక కనిపించకపోవడంతో ఇటు తల్లి, అటు నేరుగా తమ ఇంటికి రావడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..

విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడుకు చెందిన 16 సంవత్సరాల బాలిక పదో తరగతి ఫెయిలై చదువు ఆపేసింది. స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇన్ స్టాలో ఓ బాలుడితో పరిచయం కాగా నిత్యం ఛాటింగ్ చేస్తోంది. ఇది గమనించి తల్లి మందలించింది. దీంతో ఈ నెల 21న అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక.. రాత్రి అమ్మ దగ్గరకు వెళుతున్నానని చెప్పి బస్సెక్కింది. ఇన్ స్టాలో పరిచయమైన బాలుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది.

పామర్రు నియోజకవర్గంలోని కూచిపూడిలోని బాలుడి ఇంటికి వెళ్లి అతడితో పాటే ఉంటానని చెప్పింది. బాలిక చిరునామా, తల్లి ఫోన్ నెంబర్ కోసం బాలుడి కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. ఆ వివరాలేవీ చెప్పనని, గట్టిగా అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బాలిక బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన బాలుడి కుటుంబం.. నెమ్మదిగా నచ్చజెప్పి బాలిక తల్లి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఆపై ఫోన్ లో బాలిక తల్లికి సమాచారం అందించి తామే వెంటబెట్టుకుని తీసుకొస్తున్నట్లు తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి..
అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కూతురు మరుసటి రోజు కూడా రాకపోవడంతో తల్లి తన అమ్మకు ఫోన్ చేసింది. తను ముందురోజు రాత్రే బయలుదేరిందని చెప్పడంతో తల్లి ఆందోళనకు గురై కూతురుకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలుడి ఇన్‌స్టా ఐడీ ద్వారా లోకేషన్‌ కనిపెట్టారు. పామర్రు నియోజకవర్గం కూచిపూడిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి బయల్దేరగా.. బాలుడి కుటుంబ సభ్యుల నుంచి బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్‌ వచ్చింది. పోలీసులు బాలిక, బాలుడిని పటమట స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.


More Telugu News