Donald Trump: చైనా మిమ్మల్ని తినేస్తుంది.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక

Trump Warns Canada China Will Eat Them Alive
  • చైనాతో వ్యాపారం కోసం 'గోల్డెన్ డోమ్'ను వ్యతిరేకిస్తున్నారని ఆరోపణ
  • దావోస్ సదస్సు నుంచి ఇరు దేశాధినేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
  • ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకున్న కెనడా ప్రధాని
అమెరికా, కెనడా మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చైనాతో వ్యాపారం కోసం అమెరికా భద్రతా ప్రయోజనాలను కెనడా పక్కనపెడుతోందని ఆరోపిస్తూ "ఏడాదిలోపే చైనా వారిని తినేస్తుంది!" అని తన 'ట్రూత్ సోషల్' మీడియా ఖాతాలో ఘాటుగా హెచ్చరించారు.

గ్రీన్‌లాండ్‌పై అమెరికా ప్రతిపాదించిన "గోల్డెన్ డోమ్" క్షిపణి రక్షణ వ్యవస్థను కెనడా వ్యతిరేకిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఆ వ్యవస్థ కెనడాకు కూడా రక్షణ కల్పిస్తుందని, అయినా వారు చైనాతో వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఇరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. పెద్ద దేశాల ఆర్థిక ఆధిపత్యంపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. "అమెరికా వల్లే కెనడా బతుకుతోంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి కార్నీ బదులిస్తూ "కెనడియన్లు అయినందుకే కెనడా అభివృద్ధి చెందుతోంది, అమెరికా వల్ల కాదు" అని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాల మధ్య కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం జరగాల్సిన తన మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవడం గమనార్హం. ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలకు ఇది అద్దం పడుతోంది.
Donald Trump
Canada
China
US Canada relations
geopolitics
trade war
Mark Carney
World Economic Forum
Greenland
missile defense system

More Telugu News