HD Kumaraswamy: భర్తలను తాగుబోతులుగా మార్చి.. భార్యలకు రూ.2000 ఇస్తున్నారు: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

HD Kumaraswamy says Gruhalakshmi scheme turns husbands into alcoholics
  • గృహలక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.2000కు ఆశపడవద్దని మహిళలకు కుమారస్వామి సూచన
  • గ్యారెంటీల పేరుతో ప్రభుత్వం రూ. లక్ష కోట్లకు పైగా అప్పు చేస్తోందని ఆరోపణ
  • కుమారస్వామి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేసిన ఆయన కుమారుడు నిఖిల్
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న గృహలక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.2,000 ఆర్థిక సాయానికి మహిళలు ఆశపడవద్దని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీలు తాత్కాలిక ఉపశమనమే తప్ప, ప్రజల జీవితాలకు శాశ్వత పరిష్కారం చూపలేవని ఆయన అన్నారు. తుమకూరులో జరిగిన ఓ ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గ్యారెంటీల కోసం ప్రభుత్వం ఏటా రూ.50,000 కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మునే తిరిగి ఇస్తోందని కుమారస్వామి విమర్శించారు. దీనికోసం ఏటా రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల కోట్ల వరకు అప్పు చేస్తోందని, ఆ భారాన్ని ప్రజలే మోయాల్సి వస్తుందని హెచ్చరించారు. "భర్తలను తాగుబోతులుగా మార్చి, వారి జీవితాలను నాశనం చేస్తూ.. భార్యలకు రూ.2,000 ఇవ్వడంలో అర్థం ఏముంది? మాకు ఐదేళ్లు అవకాశం ఇస్తే సుపరిపాలన అందిస్తాం" అని ఆయన ప్రజలను కోరారు. ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇస్తూ రాష్ట్రాన్ని మద్యం వరదలో ముంచిందని ఆయన ఆరోపించారు.

ఇదే సమయంలో కుమారస్వామి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారని ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, 2028 ఎన్నికల్లో జేడీఎస్ ఆయన నాయకత్వంలోనే బరిలోకి దిగుతుందని తెలిపారు. ప్రజలు కూడా కుమారస్వామి పాలనను కోరుకుంటున్నారని నిఖిల్ మీడియాతో అన్నారు.
HD Kumaraswamy
Kumaraswamy
Karnataka
Gruhalakshmi Scheme
Congress
liquor
alcohol
Karnataka politics
Nikhil Kumaraswamy
JDS

More Telugu News