ఖరీదైన భవనం, 27 ఎకరాల భూమి, 1.2 కిలోల బంగారం: అక్రమాస్తుల కేసులో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌పై కేసు

  • రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న మధుసూదన్‌పై కేసు
  • ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ
  • రూ.7,83,35,302 విలువైన స్థిర, చరాస్తులు గుర్తింపు
రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ-1)గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. ఆయన వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మధుసూదన్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సోదాల్లో దాదాపు రూ.7,83,35,302 విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఈసీఐఎల్ ప్రాంతంలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఒక మూడంతస్తుల భవనం, ఇబ్రహీంపట్నం మండలంలో ఒక ఓపెన్ ప్లాటు, ఒక ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, అందులో స్విమ్మింగ్ పూల్, ఫామ్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. 1.2 కిలోల బంగారు ఆభరణాలు, మూడు ఖరీదైన కార్లు, రూ.9 లక్షల నగదును గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది.

ఏఆర్‌కే స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారంలో సుమారు రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. ఆయన భార్య, పిల్లల పేర్లతో రెండు షెల్ కంపెనీలను స్థాపించినట్లు ఏసీబీ గుర్తించింది. తదుపరి విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.


More Telugu News