మోదీ తిరువనంతపురం పర్యటన వేళ, కాంగ్రెస్ కీలక సమావేశానికి శశిథరూర్ గైర్హాజరు

  • త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు
  • ఢిల్లీలో కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశం
  • అదే సమయంలో తిరువనంతపురంలో మోదీ పర్యటన
కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకుడు శశిథరూర్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఎన్నికల వ్యూహాలను రూపొందించే క్రమంలో జరిగిన ఈ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లో పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఆయన వ్యవహారశైలిపై అధిష్ఠానం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

శశిథరూర్ ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరవుతారని తొలుత ఆయన సన్నిహిత వర్గాలు తెలిపినప్పటికీ, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో ఆయన పాల్గొనలేదు. కోజీకోడ్‌లో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొనవలసి ఉండటం వల్ల, ఇదివరకే ఖరారైన కార్యక్రమాల కారణంగా ఆయన హాజరు కాలేదని సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... థరూర్ నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

గత కొంతకాలంగా శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో ఆయన తీరుపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉంది. రాష్ట్ర నాయకులు కూడా ఆయను పార్టీ వ్యవహారాల్లో పక్కన పెడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ తనతో సరిగా వ్యవహరించలేదని శశిథరూర్ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది


More Telugu News