KTR: నాకు హీరోయిన్లతో లింకులు ఉన్నట్టు ప్రచారం చేశారు: సిట్ విచారణకు ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న కేటీఆర్
- ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని మండిపాటు
- తనకు చట్టంపై నమ్మకం ఉందని వ్యాఖ్య
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు ఇవాళ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నాటి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కూడా విచారణల పేరుతో భయపెట్టే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో రేవంత్ ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు తాము రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేశామని, ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. ప్రతిపక్షాలను వేధించే సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత రెండేళ్లుగా ప్రభుత్వం కావాలనే తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. డ్రగ్స్ ఆరోపణలు, హీరోయిన్స్‌తో లింకులు పెట్టడం వంటి నిరాధార ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో కుంభకోణాన్ని హరీశ్ రావు బయటపెట్టగానే ఆయనకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. విచారణ సమయంలో హరీశ్ సంధించిన ప్రశ్నలకు సిట్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ‘మనసు–మమత’ సీరియల్‌లా సాగుతోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. విచారణకు పదిసార్లు పిలిచినా హాజరవుతానని, ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతానని అన్నారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు ‘నోటుకు ఓటు’ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి ఈరోజు సీఎం కావడమే రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఇప్పటికీ అమలుకావడం లేదని ధ్వజమెత్తారు. సింగరేణి బొగ్గు టెండర్లలో జరుగుతున్న అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.