Indore: ఇండోర్‌లో మరోసారి.. కలుషిత నీరు తాగి 22 మందికి అస్వస్థత

Indore Water Contamination 22 Fall Ill After Drinking Contaminated Water
  • ఇండోర్‌లోని మౌ ప్రాంతంలో కలుషిత నీటితో 22 మందికి అస్వస్థత 
  • గతంలో భగీరథ్‌పురలో జరిగిన ఘటనలో 23 మంది మృతి
  • తాజాగా మౌ ప్రాంతంలో ఘటన
  • రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ బృందాలు.. నీటి నమూనాల సేకరణ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని కలుషిత నీరు వదలడం లేదు. కొన్ని రోజుల క్రితమే భగీరత్‌పుర ప్రాంతంలో డ్రైనేజీ నీరు కలిసిన పైప్‌లైన్ నీటిని తాగి సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే తాజాగా ‘మౌ’ ప్రాంతంలో మరోసారి అటువంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ కలుషిత నీటిని తాగడం వల్ల ఇప్పటివరకు 22 మంది అనారోగ్యం పాలయ్యారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 9 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

మౌ ప్రాంతంలోని బాధితుల్లో వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ శివం వర్మ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఆరోగ్య శాఖ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపడుతున్నాయి. నీటి సరఫరా లైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా లేదా మురుగు నీరు చేరుతోందా అనే కోణంలో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

గతంలో జరిగిన మరణాల నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటిని తప్పనిసరిగా మరిగించి తాగాలని, పైపుల ద్వారా వచ్చే నీటిని నేరుగా వాడవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Indore
Indore water contamination
Madhya Pradesh
water contamination
Mhow
Shivam Verma
waterborne diseases
diarrhea
vomiting
Bagirathpura

More Telugu News