గువ్వలచెరువులో పేలుతున్న పాత టీవీలు!

  • బుధవారం రాత్రి మరో ఇంట్లో పేలిన టీవీ
  • గత డిసెంబరులో జరిగిన ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు
  • రంగంలోకి దిగిన పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు
  • పాత టీవీలు వాడొద్దని గ్రామస్థులకు పోలీసుల సూచన
వైఎస్సార్ జిల్లా, రామాపురం మండలం, గువ్వలచెరువు గ్రామంలో పాత టీవీలు వరుసగా పేలుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం రాత్రి గ్రామంలోని చిన్న ఓబులేషు ఇంట్లో ఓ పాత టీవీ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు టీవీ చూస్తుండగా, అందులోంచి ఒక్కసారిగా వింత శబ్దాలు రావడం మొదలైంది. దీంతో అప్రమత్తమైన వారు వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్ది క్షణాల్లోనే టీవీ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో ఇల్లంతా దట్టమైన పొగతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.

గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబరులో ఇదే గ్రామానికి చెందిన మహబూబ్‌ బేగం ఇంట్లోనూ పాత టీవీ పేలింది. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు ఇంటి తలుపులు, కిటికీలు ధ్వంసం కాగా, బీరువాలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి.

నెల రోజుల వ్యవధిలో రెండోసారి పేలుడు సంభవించడంతో సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్తు శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. పాత టీవీలు పేలిపోతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఎస్సై శివకుమార్‌ గ్రామస్థులకు సూచించారు. ఈ వరుస ఘటనలతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు.


More Telugu News