Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలో రగడ.. గవర్నర్ పై ప్రభుత్వం ఆగ్రహం

Karnataka Government Upset with Governor Thawar Chand Gehlot
  • ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం పూర్తిగా చదవకుండానే వెళ్లిపోయిన గవర్నర్
  • గవర్నర్ ను అడ్డుకుంటూ నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • సరైన నిర్ణయం తీసుకున్నారంటూ గవర్నర్ కు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ సమర్థిస్తున్నారు. 

అసలు ఏం జరిగిందంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రసంగించాల్సి ఉంది. సాధారణంగా ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగం కాపీని గవర్నర్ సభలో చదువుతారు. ఈ సంప్రదాయం మేరకు సిద్ధరామయ్య ప్రభుత్వం గవర్నర్ కు ప్రసంగం కాపీ అందించింది. అయితే, అందులో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి చేసిన మార్పులను వ్యతిరేకించింది. కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఈ ప్రసంగం కాపీలో ప్రస్తావించింది.

దీనిని చదివేందుకు నిరాకరించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సింపుల్ గా ‘రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది.. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ప్రసంగాన్ని ముగించేశారు. ఆపై సభలో నుంచి వెళ్లిపోతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీఎం సిద్ధరామయ్య కూడా గవర్నర్ పై మండిపడ్డారు.

అయితే, కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని చదవకూడదని గవర్నర్ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అవమానించాలన్న కాంగ్రెస్ కుటిల ప్రయత్నాన్ని సరిగ్గా తిప్పికొట్టారంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర కొనియాడారు. గవర్నర్ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనకు సీఎం సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Karnataka Assembly
Karnataka Governor
Thawar Chand Gehlot
Siddaramaiah
BY Vijayendra
Employment Guarantee Scheme
Central Government
Karnataka Politics
BJP
Congress

More Telugu News