భారత్‌లో ఆడటంపై నిర్ణయం తీసుకోవడానికి.. ఐసీసీని 48 గంటల సమయం కోరిన బంగ్లా

  • భారత్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత
  • నిర్ణయం చెప్పేందుకు బంగ్లా బోర్డుకు 24 గంటల గడువు విధించిన ఐసీసీ
  • అంగీకరించకపోతే బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తామని హెచ్చరిక
  • ప్రభుత్వంతో చర్చించేందుకు 48 గంటల సమయం కోరిన బంగ్లాదేశ్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ మధ్య వివాదం ముదురుతోంది. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రతపై ఆందోళనగా ఉందని, అక్కడ ఆడటం సురక్షితం కాదని బీసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి చేసిన విజ్ఞప్తిని వర్చువల్ సమావేశంలో తిరస్కరించారు. ఈ ఓటింగ్‌లో పాకిస్థాన్ మినహా మరే దేశం బంగ్లాదేశ్‌కు మద్దతు ఇవ్వలేదు.

దీంతో ఐసీసీ కఠినంగా వ్యవహరించింది. భారత్‌లో ఆడే విషయంపై 24 గంటల్లోగా తుది నిర్ణయం చెప్పాలని బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా అంగీకారం తెలపకపోతే, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తామని స్పష్టం చేసింది.

అయితే, ఈ విషయంపై తమ ప్రభుత్వంతో తుదిసారిగా చర్చించేందుకు 48 గంటల సమయం కావాలని బీసీబీ ఐసీసీని కోరింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో ఈ వివాదం మొదలైంది. ఐసీసీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి, వారి సూచనల మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని బీసీబీ అధికారి ఒకరు తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయంపైనే ఆ జట్టు ప్రపంచకప్ భవితవ్యం ఆధారపడి ఉంది.


More Telugu News