Sunita Williams: అంతరిక్షయానంలోని తన అనుభవాలను పంచుకున్న సునీతా విలియమ్స్

Sunita Williams Shares Her Space Travel Experiences
  • అంతరిక్షయానం తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందన్న సునీతా విలియమ్స్
  • అంతరిక్షం నుంచి భూమిని గ్రహంగా చూసినప్పుడు జీవితం పట్ల దృక్పథాన్ని మార్చివేసిందని వెల్లడి
  • మనుషుల మధ్య విభేదాలు, గొడవలు చిన్నవిగా అనిపిస్తాయన్న సునీతా
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షయానంలో తన అనుభవాలను పంచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆమె 'ఐస్ ఆన్ స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్' అనే అంశంపై మాట్లాడారు. అంతరిక్షయానం తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని ఆమె అన్నారు. అంతరిక్షం నుంచి భూమిని ఒక గ్రహంగా చూసినప్పుడు జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చివేసిందని తెలిపారు.

వివిధ అంశాలపై మనుషుల మధ్య గొడవలు, విభేదాలు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మనం అంతరిక్షానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఎక్కడ ఉందో చూడాలనుకుంటారని, తాను కూడా అదే చేశానని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి భారతదేశానికి చెందిన వారని, తల్లి స్లొవేనియాకు చెందిన వ్యక్తి అని, ఆ ప్రదేశాల గురించి తాను వెతికినట్లు ఆమె తెలిపారు. మనం దేని కోసం వెతికినా చివరకు భూమి అంతా ఒకటేనని తెలుసుకుంటామని ఆమె అన్నారు.

అంతరిక్షం నుంచి అద్భుతమైన ఈ గ్రహాన్ని చూసినప్పుడు జీవితం పట్ల ఆలోచన ధోరణి మారుతుందని, వ్యక్తుల మధ్య విభేదాలపై మన అభిప్రాయం మారుతుందని సునీతా విలియమ్స్ అన్నారు. ఒక గృహిణిగా కుటుంబంలోని వాదనల గురించి తాను అర్థం చేసుకుంటానని, అదే సమయంలో అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపిస్తాయని ఆమె అన్నారు.
Sunita Williams
Sunita Williams space experience
Indian astronaut
space travel
Delhi event

More Telugu News