ఏపీకి రావాలంటూ ఫిన్‌టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ సంస్థలకు ఆహ్వానం... దావోస్‌లో వ్యాపార దిగ్గజాలతో లోకేశ్ చర్చలు

  • దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి లోకేశ్ బిజీబిజీ
  • విశాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు జెరోధాకు ప్రతిపాదన
  • గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాలపై జపాన్ సంస్థ 'జెరా'తో కీలక చర్చలు
  • విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని స్కేల్ ఏఐకి ఆహ్వానం
  • ప్రతిపాదనలను పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించిన గ్లోబల్ కంపెనీలు
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రాన్ని టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య, ఆర్‌టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తన పర్యటనను వేగవంతం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో భాగంగా ఆయన ఫిన్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, స్పష్టమైన ప్రతిపాదనలతో వారిని ఏపీకి ఆహ్వానించారు.

విశాఖలో టెక్ హబ్.. జెరోధాకు ప్రతిపాదన
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ 'జెరోధా' ఫౌండర్ నిఖిల్ కామత్‌తో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నాన్ని ఫిన్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా అక్కడ ఒక టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్లాట్‌ఫామ్ ఇంజనీరింగ్, బ్యాకెండ్ సిస్టమ్స్, ట్రేడింగ్ అల్గోరిథంలు, డేటా అనలిటిక్స్‌పై ఈ కేంద్రం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం కావాలని, యువ పారిశ్రామికవేత్తలకు లీడ్ మెంటర్‌గా వ్యవహరించాలని ఆహ్వానించారు. 

అంతేకాకుండా, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. లోకేశ్ ప్రతిపాదనలపై స్పందించిన నిఖిల్ కామత్, వాటిని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

గ్రీన్ ఎనర్జీపై జపాన్ సంస్థ 'జెరా'తో చర్చలు
పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రసిద్ధి చెందిన జపాన్ సంస్థ 'జెరా' (JERA) గ్లోబల్ సీఈవో, ఛైర్మన్ యుకియో కానితో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలోని మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, సమీప ప్రాంతాల్లో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇక్కడ తయారైన లో-కార్బన్ అమ్మోనియాను జపాన్, ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను ఆయన వివరించారు. 

పారిశ్రామిక అవసరాల కోసం రాయలసీమలో సౌర-పవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అలాగే రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లలో ఉద్గారాలను తగ్గించేందుకు ఏపీ జెన్‌కో, ఎన్టీపీసీలతో కలిసి పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. దీనిపై యుకియో కాని సానుకూలంగా స్పందిస్తూ, భారత్‌లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వాల్యూ చైన్‌లను అభివృద్ధి చేయడంపై తాము దృష్టి సారించామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

ఏఐ రంగంలోకి 'స్కేల్ ఏఐ'కి ఆహ్వానం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న 'స్కేల్ ఏఐ' (Scale AI) గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రెవర్ థాంప్సన్‌తోనూ మంత్రి లోకేశ్ చర్చలు జరిపారు. సుమారు 29 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఈ సంస్థ అమెరికా రక్షణ శాఖ, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలకు సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో 'స్కేల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆహ్వానించారు.

ఆర్టీఐహెచ్ (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్) భాగస్వామ్యంతో ఏఐ భద్రత, గవర్నెన్స్‌పై ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఏఐ అప్లికేషన్ల కోసం తమ ప్లాట్‌ఫామ్‌ను అందించాలని కోరారు. రాష్ట్రంలో ఏఐ అక్షరాస్యతను పెంచే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ విజన్‌ను ప్రశంసించిన ట్రెవర్, పెట్టుబడి ప్రతిపాదనలను తమ బోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని చెప్పారు.


More Telugu News