ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ
- రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప
- రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
- ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచన
ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తమ డిఫాల్ట్ బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, నిందితులకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ట్రయల్ కోర్టేనని స్పష్టం చేసిన ధర్మాసనం, నాలుగు వారాల గడువు ఇస్తూ ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
మద్యం కేసు నేపథ్యం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘జే బ్రాండ్’ పేరుతో ప్రజలను నిలువుదోపిడి చేశారని తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై లోతైన విచారణకు ఆదేశించింది.
దీంతో అప్పటి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు కాగా, పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇప్పటికే కొందరు నిందితులకు బెయిల్ లభించగా, మరికొందరు ఇంకా జైలులోనే ఉన్నారు. ఇంకొందరు నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.