చరిత్రలో తొలిసారి... రికార్డు స్థాయిలో రూపాయి పతనం

  • డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ఠానికి పడిపోయిన రూపాయి
  • ఒక దశలో 91.74 స్థాయికి చేరిన మారకం విలువ
  • బంగారం, వెండి దిగుమతులు పెరగడం ఒక కారణం
  • దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల తరలింపు ప్రభావం
  • అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు కూడా పతనానికి మ‌రో కారణం
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్‌లో రూపాయి భారీగా నష్టపోయి, ఒక దశలో 91.74 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. మార్కెట్‌లో నెలకొన్న పలు ప్రతికూల పరిణామాల మధ్య ఒక్కరోజే 77 పైసల మేర విలువను కోల్పోయింది.

నిన్న‌ 90.97 వద్ద ముగిసిన రూపాయి, ఇవాళ‌ ఉదయం 91.05 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో రూపాయి విలువ అంతకంతకూ దిగజారింది. బంగారం, వెండి దిగుమతులు పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది.

మరోవైపు అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వార్తలు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. వీటికి తోడు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగడం రూపాయి విలువను మరింత బలహీనపరిచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 


More Telugu News