లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి ఆసుపత్రికి తరలింపు
- రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి అస్వస్థత
- విజయవాడ జీజీహెచ్ కు తరలింపు
- వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి జైలుకి తరలించనున్న పోలీసులు
ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జైల్లో ఉండగానే ఆయనకు స్వల్ప అనారోగ్యం తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు తరలించారు. ఆసుపత్రిలో రాజ్ కసిరెడ్డికి వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా స్వల్ప అస్వస్థత కారణంగానే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి జైలుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
లిక్కర్ కేసు నేపథ్యం:
జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో, ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో ఏ1 నిందితుడిగా రాజ్ కసిరెడ్డిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా జైలులోనే ఉన్నారు.