దమ్ముంటే చర్చకు రా.. ఏబీ వెంకటేశ్వరరావుకు జనసేన నేత బొలిశెట్టి సవాల్!

  • అమరావతి ఆలస్యానికి ఆ పెద్దాయనే కారణమంటూ బొలిశెట్టిపై ఏబీ ఆరోపణలు
  • కేసులు వేయించి నిర్మాణాన్ని అడ్డుకున్నారని విమర్శలు
  • వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను ఖండించిన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ
  • నిరాధార ఆరోపణలంటూ బహిరంగ చర్చకు రావాలని సవాల్
  • క్షమాపణ చెప్పాలని డిమాండ్.. ఎక్స్‌ వేదికగా మాటల యుద్ధం
అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రారంభమైన ఈ వివాదం, చివరికి బహిరంగ చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది.

ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు ఇవే..
ఇటీవల వైసీపీ అధినేత జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ, రాజధాని నిర్మాణంలో జాప్యానికి గల కారణాలను వివరించారు. "అమరావతికి పర్యావరణ అనుమతులు రాకుండా అడ్డుకునేందుకు చాలా పిటిషన్లు వేశారు. అందులో బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఒకరు. ఆ పెద్దాయనతో సుప్రీంకోర్టు వరకు కేసులు వేయించి, పనులను మూడేళ్లపాటు సాగదీశారు. దీనివల్లే నిర్మాణం పూర్తికాలేదు. ఇప్పుడు మేం నిజాలు చెబుతాం, అబద్ధాలను ఖండిస్తాం" అంటూ ఏబీ వ్యాఖ్యానించారు.

బొలిశెట్టి తీవ్ర స్పందన
ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అమరావతి రాజధానికి, రైతులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచానని గుర్తుచేశారు. తాను వేసిన కేసులు కేవలం అమరావతిలోని జరీబు భూములు, వరద ముంపు ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణ కోసం మాత్రమేనని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కాదని స్పష్టం చేశారు.

"వైసీపీ పాలనలో ఏబీ వెంకటేశ్వరరావు కలుగులో దాక్కున్నప్పుడు, నేను జగన్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాను. అలాంటి నన్ను జగన్ మనిషి అనడం హాస్యాస్పదం. సంస్కారం లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి" అని బొలిశెట్టి హితవు పలికారు.

బహిరంగ చర్చకు రావాల‌ని సవాల్
ఏబీ వెంకటేశ్వరరావు తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. "దమ్ముంటే, నా ఆరోపణలపై మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలి. సమయం, వేదిక మీరే నిర్ణయించండి" అంటూ ఎక్స్‌ వేదికగా సవాల్ విసిరారు. 


More Telugu News