గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసే ఉన్నారు: కవిత

  • ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ డ్రామా మొదలుపెట్టారన్న కవిత
  • ఒక జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్
  • ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టాలన్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ డ్రామా మొదలుపెట్టారని తెలిపారు. గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసే ఉన్నారని... ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఎందుకు విచారణ చేపట్టారని ప్రశ్నించారు. ఈ విచారణ తుది దశకు చేరతుందనే నమ్మకం లేదని చెప్పారు. ఈ విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందని తాను భావించడం లేదని అన్నారు.


బలహీన వర్గాలకు పొలిటికల్ పవర్ వచ్చినపుడే సమాజం బాగుపడుతుందని కవిత చెప్పారు. యువత, మహిళలు ఎక్కడ పోటీచేసినా జాగృతి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బీసీ వర్గాన్ని మభ్యపెడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో వారికి 42 శాతం వాటా కూడా ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలకు వెళుతోందని విమర్శించారు. సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలి అని, అలాగే పీవీ నరసింహారావు పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదని కవిత విమర్శించారు. ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రావారి విగ్రహాలే ఉన్నాయని... తెలంగాణ మహనీయుల విగ్రహాలు లేవని చెప్పారు. ఆంధ్రవారి విగ్రహాలను తొలగించాలని తాను చెప్పడం లేదని... తెలంగాణవారి విగ్రహాలను కూడా పెట్టాలని చెబుతున్నానని అన్నారు. 



More Telugu News