Mark Zuckerberg: మెటాలో మళ్లీ లేఆఫ్స్.. 15,000 మంది ఇంటికి!

Meta Layoffs Again 15000 Employees to be Fired
  • జుకర్‌బర్గ్ నిర్ణయానికి మాజీ ఉద్యోగి మద్దతు
  • మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగం నుంచి తొలగింపులు
  • వర్చువల్ రియాలిటీపై ఖర్చు తగ్గింపు
  • ఏఐ ఆధారిత వేరబుల్స్ వైపు మెటా ఫోకస్  
టెక్ దిగ్గజం మెటాలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మెటావర్స్, వర్చువల్ రియాలిటీ విభాగాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ భారీ లేఆఫ్స్‌కు తెరలేపారు. తాజా నిర్ణయంతో దాదాపు 15,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు.

ఇప్పటివరకు మెటావర్స్ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను మెటా కుమ్మరించింది. అయితే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకుంది. వీఆర్ హెడ్‌సెట్ల కంటే ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, వేరబుల్ గ్యాడ్జెట్లపై పెట్టుబడి పెట్టడం మేలని భావించిన మెటా అందుకు అనుగుణంగానే ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.

ఈ లేఆఫ్స్ నిర్ణయంపై ఓకులస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 2017లో కొన్ని వివాదాల కారణంగా జుకర్‌బర్గ్ చేత తొలగించబడ్డ పామర్.. ఇప్పుడు అదే జుకర్‌బర్గ్ నిర్ణయాన్ని సమర్థించారు. "VR రంగం ఆరోగ్యకరంగా ఎదగాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమే. అనవసరమైన విభాగాలను తొలగించడం ద్వారా కంపెనీ తన లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలదు" అని ఆయన పేర్కొన్నారు.

గత రెండేళ్లుగా మెటా వరుసగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. తాజా లేఆఫ్స్‌తో రియాలిటీ ల్యాబ్స్‌లో పనిచేస్తున్న నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తొలగింపునకు గురైన వారికి మెటా తన ప్యాకేజీ నిబంధనల ప్రకారం పరిహారం అందజేయనుంది.
Mark Zuckerberg
Meta layoffs
Metaverse
Virtual Reality
Palmer Luckey
Oculus
Tech layoffs
Reality Labs
AI Smart Glasses
Wearable Gadgets

More Telugu News