APSRTC Conductor: జీరో టికెట్ వివాదం.. ఉద్యోగం నుంచి తొలగింపు.. మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

RTC Conductor Dies After Job Loss Over Zero Ticket Issue
  • ప్రయాణికురాలికి ఆధార్ కార్డు లేకపోయినా జీరో టికెట్ ఇచ్చారని కండక్టర్‌పై వేటు
  • ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు
  • అధిక రక్తపోటుతో మరణించిన కండక్టర్ రాజ్ కుమార్
  • నర్సంపేట డిపో ముందు మృతదేహంతో కుటుంబ సభ్యుల నిరసన
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఉద్యోగం నుంచి తొలగించబడిన ఓ ఆర్టీసీ కండక్టర్ మనస్తాపంతో మరణించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, మృతదేహంతో డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం చోటుచేసుకుంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
సంగెం మండలం పల్లారుగూడ గ్రామానికి చెందిన బొమ్మ రాజ్ కుమార్ నర్సంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రయాణికురాలికి ఆధార్ కార్డు లేకపోయినా జీరో టికెట్ ఇచ్చారని, మరో ప్రయాణికుడి వద్ద నగదు తీసుకుని జీరో టికెట్ జారీ చేశారని టీసీ తనిఖీల్లో తేలింది. ఈ కారణంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు నాలుగు రోజుల క్రితం రాజ్ కుమార్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు.

ఉద్యోగం కోల్పోవడంతో రాజ్ కుమార్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఈ క్రమంలో అధిక రక్తపోటు రావడంతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందారు. దీంతో తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు రాజ్ కుమార్ మృతదేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్దకు తీసుకొచ్చి నిరసనకు దిగారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఈ ఘటనతో డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
APSRTC Conductor
Bomma Raj Kumar
Narsampet
Zero ticket
Dismissal
Suicide
RTC strike
Telangana RTC
Protest
High blood pressure

More Telugu News