Rodde Anjaneyulu: క్రూరత్వం.. పగ.. అనుమానం: హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు దారుణ హత్యలు!

Three Murders In One Day In Hyderabad
  • బోరబండలో భార్యను చంపి.. మృతదేహంతో సెల్ఫీ దిగిన భర్త
  • కూకట్‌పల్లిలో భర్తను చున్నీతో చంపిన భార్య
  • 28 రోజుల తర్వాత బయటపడిన నిజం
  • జవహర్‌నగర్‌లో తల్లి సహజీవనంపై కొడుకు ఆగ్రహం
  • వ్యక్తిని చంపబోయి కన్నతల్లినే బలితీసుకున్న వైనం
నమ్మకం సడలితే ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడరని భాగ్యనగరంలో జరిగిన మూడు దారుణ ఘటనలు నిరూపిస్తున్నాయి. అనుమానం, పగ, క్షణికావేశం పచ్చని సంసారాలను చిధ్రం చేస్తున్నాయి. ఒకచోట భార్యను చంపి శవంతో సెల్ఫీ దిగిన ఉన్మాదం కనిపిస్తే.. మరోచోట భర్త మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించిన భార్య కుట్ర బయటపడింది. ఇంకోచోట కొడుకు కోపానికి కన్నతల్లే బలైన విషాదం చోటుచేసుకుంది.

రోకలిబండతో భార్య హత్య.. ఆపై వాట్సాప్ స్టేటస్!
   
వనపర్తి జిల్లాకు చెందిన రొడ్డె ఆంజనేయులు (కారు డ్రైవర్), సరస్వతి (32) దంపతులు బోరబండలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో నివసిస్తున్నారు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడే ఆంజనేయులు, ఈ నెల 17న ఆమె పండగ ముగించుకుని రాగానే హతమార్చాలని ప్లాన్ చేశాడు. సోమవారం రాత్రి నిద్రిస్తున్న సరస్వతిని రోకలిబండతో మోది అతి దారుణంగా చంపేశాడు. అనంతరం మృతదేహంతో సెల్ఫీ తీసుకుని, దానిని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి పరారయ్యాడు. ఉదయాన్నే రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి పిల్లలు మేనమామకు వీడియో కాల్ చేసి చూపించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

ప్రమాదం కాదు.. చున్నీతో చేసిన హత్య!
   
కూకట్‌పల్లిలోని ‘ఈనాడు హైట్స్‌’లో నివసించే జగవరపు సుధీర్ రెడ్డి, ప్రసన్న దంపతుల మధ్య పరస్పర అనుమానాలు చిచ్చురేపాయి. గత నెల 23న మద్యం మత్తులో సుధీర్ భార్యపై దాడి చేయగా, కోపంతో ఊగిపోయిన ప్రసన్న తన చున్నీని భర్త మెడకు బిగించి హతమార్చింది. ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి, మెట్ల మీద నుంచి పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, 28 రోజుల తర్వాత వచ్చిన పోస్టుమార్టం నివేదికలో గొంతు బిగించడం వల్లే మృతి చెందినట్లు తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

తల్లి ప్రాణం తీసిన కొడుకు కోపం!
జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీ నగర్‌కు చెందిన పొట్టోళ్ల రజని (40), జమీల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. దీనిని ఆమె కుమారుడు రాజ్ కరణ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడు. జమీల్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన రాజ్ కరణ్, తన స్నేహితులతో కలిసి మద్యం పార్టీ ఏర్పాటు చేసి గొడవకు దిగాడు. కోపంతో జమీల్‌పై కత్తి విసరగా, అది అడ్డువచ్చిన తల్లి రజని కంట్లోకి బలంగా దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు రాజ్ కరణ్‌తో పాటు అతని స్నేహితుడిని రిమాండ్‌కు తరలించారు.
Rodde Anjaneyulu
Hyderabad crime
murder
domestic violence
wife murdered
husband arrested
Prasanna
Raj Karan
extra marital affair
crime news

More Telugu News