WEF-2026: ఏపీలో ఆర్‌ఎంజెడ్ రూ.83 వేల కోట్ల పెట్టుబడులు... దావోస్‌లో మంత్రి నారా లోకేశ్ ప్రకటన

 Nara Lokesh announce a landmark 10 billion partnership between Andhra Pradesh and RMZ Group
  • దావోస్ వేదికగా ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి
  • ప్రముఖ సంస్థ ఆర్‌ఎంజెడ్ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
  • విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, డేటా సెంటర్ ఏర్పాటు
  • రాయలసీమలో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణం
  • ఈ ప్రాజెక్టుల ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీ పెట్టుబడి సమీకరణ దిశగా కీలక ముందడుగు పడింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF-2026) వేదికగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఆర్‌ఎంజెడ్ (RMZ) గ్రూప్‌తో 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,000 కోట్లు) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో 10 మిలియన్ చదరపు అడుగుల (1 కోటి చ.అ.) విస్తీర్ణంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులతో విశాఖ నగరాన్ని కీలకమైన డిజిటల్, జీసీసీ, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రాంతీయ సమాన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమలో 1,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్‌ను కూడా ఈ భాగస్వామ్యంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇది రాయలసీమ పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.

ఈ ఒప్పందంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. "రాష్ట్ర ప్రభుత్వ స్పష్టమైన విధానాలు, పనులను కచ్చితంగా పూర్తిచేసే సామర్థ్యం, వేగంగా వ్యాపార అనుమతులు ఇవ్వడంలో మా నిబద్ధతే ఈ భారీ పెట్టుబడికి కారణం" అని వివరించారు. ఐటీ, డేటా సెంటర్లు, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడితో రాష్ట్ర ముఖచిత్రం మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
WEF-2026
Daos
Nara Lokesh
RMZ Group
Andhra Pradesh

More Telugu News