గ్రీన్‌లాండ్‌పై విభేదాల వేళ, భారత్‌తో వాణిజ్యంపై యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన

  • స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉందన్న ఉర్సులా
  • చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నామని వ్యాఖ్య
  • దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌'గా పిలుస్తారన్న ఉర్సులా
భారతదేశం, ఐరోపా సమాఖ్యలు చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెల్ లెయెన్ పేర్కొన్నారు. భారత్, ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఉంది. ఈ నేపథ్యంలో లెయెన్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉందని తెలిపారు.

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, కొందరు ఈ డీల్ ను 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌'గా అభివర్ణిస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా కోట్లాది మంది ప్రజలకు వస్తువులు, సేవలు ఎగుమతి, దిగుమతి చేసుకునే సౌలభ్యం కలుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె వచ్చే వారం భారతదేశంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.

గ్రీన్‌లాండ్ విషయంలో ఐరోపా దేశాలతో అమెరికాకు విభేదాలు తలెత్తిన నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలపై ఉర్సులా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గ్రీన్‌లాండ్ విషయంలో తమకు మద్దతు తెలుపని ఏడు యూరప్ దేశాలపై ట్రంప్ 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది.


More Telugu News