చంద్రబాబు దావోస్‌కు వెళ్లినా జగన్ భజనే చేస్తున్నారు: కొరముట్ల శ్రీనివాసులు
- అన్నిటికీ జగన్ పేరు చెప్పడమే ప్రభుత్వానికి అలవాటైందన్న కొరముట్ల
- చంద్రబాబు ప్రభుత్వంలో ల్యాండ్, మైనింగ్ మాఫియా పెరిగిపోయిందని ఆరోపణ
- సంక్రాంతి సమయంలో లిక్కర్ మాఫియా రెచ్చిపోయిందని విమర్శ
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా మాజీ సీఎం జగన్ నామస్మరణే చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. దావోస్‌కు వెళ్లినా చంద్రబాబు జగన్ భజనే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాలనపై దృష్టి పెట్టకుండా జగన్ పేరు చెప్పడమే ప్రభుత్వానికి అలవాటైందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. సంక్రాంతి పండుగ సమయంలో లిక్కర్ మాఫియా రెచ్చిపోయిందని... క్వార్టర్ పై ప్రభుత్వం పది రూపాయలు పెంచితే, మాఫియా మరో అరవై రూపాయలు పెంచి ప్రజలను దోచుకుందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మద్యం అమ్మకాలు సాగించారన్నారు. మందా సాల్మన్ హత్యతో దేశమంతా ఉలిక్కిపడినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
జగన్‌కు ఓటేశారనే కారణంతో పిన్నెల్లి గ్రామంలో 1,500 కుటుంబాలను బహిష్కరించడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి శాంతిభద్రతల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు తన బినామీలకు వేల కోట్ల విలువైన భూములను దోచి పెడుతున్నారని, ప్రజా సమస్యలను పక్కనపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.