ఫోన్ ట్యాపింగ్‌పై కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు: అద్దంకి దయాకర్

  • హరీశ్ రావుపై  అద్దంకి దయాకర్, బీర్ల ఐలయ్య, బల్మూరి వెంకట్ ఆగ్రహం
  • ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేయించారని కవిత ఆరోపించారన్న కాంగ్రెస్ నాయకులు
  • హరీశ్ రావు బాధితుడైతే వివరాలు చెప్పాలి, బాధ్యుడైతే సమాధానం చెప్పాలని డిమాండ్
ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేయించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారని, ఆమె వేసిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, బీర్ల ఐలయ్య, బల్మూరి వెంకట్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును సిట్ విచారిస్తోంది. విచారణకు హాజరు కావడానికి ముందు హరీశ్ రావు చేసిన విమర్శలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావు బాధితుడైతే వివరాలు చెప్పాలని, బాధ్యుడైతే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసు కొత్తదేమీ కాదని, గత రెండేళ్లుగా దీనిపై విచారణ సాగుతోందని అన్నారు. హరీశ్ రావు తనకు తాను పోరాట యోధుడిలా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేయించారని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత చెప్పారని గుర్తు చేశారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంటూ కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని హరీశ్ రావు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఎలా వేధించారో అందరికీ తెలిసిందేనని అన్నారు. ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హరీశ్ రావుకు నిజాయతీ ఉంటే ప్రజల సొమ్మును దోచుకోలేదని ప్రమాణం చేయాలని వారు అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేయకుంటే విచారణను ఎదుర్కోవడానికి భయమెందుకని ప్రశ్నించారు. తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే బీఆర్ఎస్ నేతలు బయట కూడా తిరగలేరని వారు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులతో తప్పుడు పనులు చేయించి వారిని అబాసుపాలు చేశారని అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష పడటం ఖాయమని అన్నారు.


More Telugu News