అయ్య బాబోయ్.. ఒక్కరోజే రూ. 12 వేలు పెరిగిన వెండి.. బంగారం ధరకు రెక్కలు

  • జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్న వెండి ధర పెరుగుదల
  • రూ. 3.30 లక్షలకు చేరిన కిలో వెండి ధర
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,280

బంగారం ఇప్పటికే సామాన్యులకు కలగా మారితే... ఇప్పుడు వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. ఇటీవలి రోజుల్లో వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌తో పాటు, సోలార్ ప్యానెల్స్‌, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), 5G టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.


గత నాలుగు రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా రూ.24 వేల వరకు పెరగడం గమనార్హం. ఇందులో ఒక్క రోజులోనే రూ.12 వేల పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,30,000కు చేరింది. ఇంతవరకు వెండిని తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉండగా, ఇప్పుడు అది కూడా అందని స్థాయికి చేరింది.


ఇక బంగారం ధరలు కూడా అదే దిశగా పరుగులు తీస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.950 పెరిగి రూ.1,35,000గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర త్వరలోనే రూ.1,50,000 మార్క్‌ను తాకుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. వచ్చే నెల నుంచి శుక్ర మౌఢ్యమి ముగిసి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి ఆభరణాలపై డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.



More Telugu News